English Translated

Soon we will also post English translated articles to the blog....

Tuesday, March 23, 2021

"నమస్కారం" ప్రాముఖ్యత


మన హిందూ సాంప్రదాయం లో ఒకరి కి ఒకరు కలిసినప్పుడు చేతులు జోడించి ఆప్యాయంగా నమస్కారం చెప్పుకొని పలకరించు కుంటాము. నమస్కారం  "నమస్తే" అనే సంస్కృత పదం నుండి వెలువడినది. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక శక్తి ఉందనే విషయాన్ని సూచిస్తుంది నమస్తే. 

 " నమస్తే యొక్క అర్దం --- నమ అంటే విల్లు,  స అంటే నేను, తే అంటే నువ్వు. నేను మీకు నమస్కరిస్తున్నాను అని అర్థం." 


           NAMASKARAM

  

            భారతదేశంలో సహోద్యోగులను పలకరించేటప్పుడు నమస్తే సంజ్ఞను ఉపయోగించడం సర్వ సాధారణం. సాంప్రదాయ శైలిలో నమస్తే చెప్పేటప్పుడు  రెెండు చేతులు జోడించి,  వేళ్లు పైకి చూపిస్తూ, ఛాతి మధ్యలో అనహత చక్రం వద్ద బ్రొటన వేళ్లు మరియు అరచేతిని తాకాలి - దీనిని  అంజలి ముద్ర అని పిలుస్తారు. చెప్పేటప్పుడు నమస్కరించడానికి ఒక చిన్న కదలిక చేయాలి. కళ్ళు మూసుకోవాలి, సైగ చేసేటప్పుడు వస్తువులను చేతుల్లో ఉంచకూడదు. నమస్తే క్షమాపణ కోరడానికి కూడా ఉపయోగిస్తారు మరియు తప్పులను అంగీకరించేటప్పుడు ఉపయోగించడం మర్యాదగా ఉంటుంది. ఒక్కరి తో సంబోధిస్తే నమస్తే అని, సమూహం లో పలువురితో సంబోధిస్తే నమస్కారం అని చెప్పాలి.

SUN SALUTE

                        ఒక వ్యక్తి మరొకరిని నమస్తే అని పలకరించినప్పుడు, ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక భావన కలిగి ఒక బంధము ఏర్పడుతుంది.  ప్రతి ఒక్కరిలోనూ దైవం, ఆత్మ ఒకటే అని హిందువులు నమ్ముతారు. కాబట్టి మీరు ఎవరితోనైనా నమస్తే అని చెప్పినప్పుడు, అది ‘నేను మీలోని దైవానికి నమస్కరిస్తున్నాను’ అని సూచిస్తుంది. ఈ సంజ్ఞ ఆజ్ఞా చక్రంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది, అనగా మనస్సు కేంద్రం లేదా మూడవ కన్ను. అందువల్ల, మీరు వ్యక్తిగతంగా ఒకరిని కలిసినప్పుడు, మీరు ఒక భౌతిక జీవితో పాటు వారి మనస్సును కూడా కలుస్తారు. ఆపై మీరు తల వంచి, మీ చేతులు జోడించి నమస్తే అని చెప్పినప్పుడు, సంజ్ఞ ‘మన మనస్సులు కలవవచ్చు’ అని సూచిస్తుంది. మీరు కలిసిన వ్యక్తికి మీ ప్రేమ, గౌరవం మరియు స్నేహాన్ని తెలియజేయడానికి ఇది గొప్ప మార్గం.
                  నమస్తే భారతదేశంలో రోజువారీ విధానంలో భాగం. అందువల్ల మీరు ఈ సంజ్ఞను వివిధ భారతీయ శాస్త్రీయ నృత్య రూపాల్లో,  మరియు యోగా భంగిమలలో చూడవచ్చు. 

       "ఓం సహనావవతు  సహనౌ భునక్తు 
                  సహవీర్యం కరవావహై
     తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై"
                 ఓం శాంతి శాంతి శాంతిః


      

Monday, March 8, 2021

ప్రాణము- ప్రాణాయామము

మన శరీరంలో ఆలోచనలు దగ్గర నుండి ప్రతి క్రియ జరగడానికి మూలం ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి శరీరంలో ఉన్న 72000 నాడుల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి ఆధారంగా నే ప్రాణం ఉంటుంది శరీరంలో. శరీరం, మనస్సు రెండింటి నీ అనుసంధానం చేసేది కూడా ఈ ప్రాణశక్తి. ప్రాణశక్తి లయబద్ధంగా పని చేస్తూ ఉంటే మిగిలిన వి అన్ని చక్కగా పని చేస్తాయి. శ్వాస ద్వారా ప్రాణశక్తిని నియంత్రించవచ్చు. శ్వాస ఆధారంగా చేసే ప్రక్రియ ప్రాణాయామము. పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగ  లో నాలుగవది ప్రాణాయామము. ప్రాణాయామము అనగా ప్రాణ+ ఆయమము. ప్రాణశక్తిని ఉద్దీపింప చేయడమే ప్రాణాయామము.మన శరీరంలో ఉన్న 3 ప్రధాన నాడు లు సూర్య నాడి, చంద్ర నాడి,  సుషుమ్న నాడి. 


ప్రాణాయామము చేయడం వలన సూర్య నాడి, చంద్ర నాడి  మీద ఒత్తిడి తగ్గి సుషుమ్న నాడి ప్రవాహం మెరుగై జీవిత కాలాన్ని పెంచుతుంది. పూరకము అనగా గాలి బాగా తీసుకోవడం, కుంభకం అనగా గాలి నుండి కుంభించి ఉంచడం, రేచకము అనగా గాలిని పూర్తిగా వదిలేయడం. ఈ పూరక, కుంభక, రేచకము అనుసంధానం తో చేసేది ప్రాణాయామము. 


సూర్యోదయం కాని సూర్యాస్తమయ సమయాల్లో 30 నిమిషాల సమయం వీలు చేసుకుని శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న గాలి లోపలికి తీసుకుంటున్న భావన, శ్వాస వదులుతూ మన శరీరంలో మలినాలు తో ఉన్న గాలి బయటకు వదులుతున్న భావన తో చేయాలి.  ప్రాణాయామ సాధన కు ముఖ్యం గా పాటించవలసి నవి 5 నియమాలు  సరైన సమయం, మంచి  గాలి వెలుతురు ఉన్న ప్రదేశం, తేలికగా జీర్ణమయ్యే పోషకాహారం, సాధన చేయాలనే జిజ్ఞాస, నాడి శుద్ధి.

ప్రాణాయామ సాధన వలన కలిగే ప్రయోజనాలు:

* రక్తము శుద్ధి జరిగి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
* ఊపిరితిత్తులు, గుండె, మెదడు అన్ని అవయవముల పనితీరు మెరుగుపడుతుంది.
* నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
* ఒత్తిడి తగ్గి రక్తపోటు అదుపులో ఉంటుంది.
* వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* జీర్ణక్రియ మెరుగవుతుంది.
       
     

Friday, February 26, 2021

శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం - అనగా ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి సాధనము

"శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం"  అనగా ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి  సాధనము
అని చరకసంహిత అనే ఆయుర్వేద గ్రంథం లో చెప్పబడినది. ఈ శరీరమే మనం జీవించి ఉన్నంత కాలం మన వాహనం , కావున శరీరాన్ని  చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉన్నది.  

        దేహమే దేవాలయం అంటారు కదా, కాబట్టి శరీరం ఆరోగ్యంగా, చైతన్య వంతంగా  ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే  ఆహార నియమాలు, యోగాభ్యాసం, సత్యవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలి.  ఈ జీవన విధానం అలవరచుకోవడానికి మనము ముఖ్యం గా పాటించవలసినవి 4 నియమాలు ఆహార్, విహార్, ఆచార్, విచార్.

        ఆహారం విషయానికి వచ్చేసరికి. మనము తినే ఆహారం బట్టి మనం శరీరం పనితీరు ఉంటుంది.కాబట్టి మనం తినే ఆహారం లో పోషక విలువలు గమనించాలి. తాజాగా వండిన వాటిని తినాలి. ఆహారం నోట్లో నములుతూ ఉండగానే సగం అరగాలి కాబట్టి టీవీ, మీడియా ప్రభావం పడకుండా ఏకాగ్రత తో నమిలి తినాలి. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. మితంగా (పొట్ట లో సగ భాగం ఆహారం, పావు వంతు నీరు, పావు వంతు ఖాలీగా ఉండే టట్టు)తినాలి. మనం తినే ఆహారం రంగు, రుచిని ఆస్వాదిస్తూ తినాలి.

        విహారం అంటే వినోదం. ఈ రోజుల్లో ఒత్తిడి ఒక సాధారణ అంశం అయినది. ప్రతిఒక్కరూ రోజువారీ పనులతో ఒత్తిడికిగురవుతున్నారు. కాబట్టి ఎవరికి వాారు వినోదం, విశ్రాంతి కొరకు  సమయం కేటాయించుకోవాలి. కుటుంబ సమయాన్ని ఆస్వాదించడం ద్వారా కూడా మన శరీరం మరియు మనస్సుకు చైతన్యం కలుగుతుంది. మనం ఆనందించే కార్యకలాపాలలో కొంత సమయం గడపడం వల్ల కూడా  మనస్సుపై ఆందోళనను తొలగిస్తుంది. మొక్కలు పెంచడం,  పెయింటింగ్, సంగీత వాయిద్యాలను ప్లే చేయడం వంటి క్రియాశీల సృజనాత్మక అభిరుచులు మనస్సును రీఛార్జ్ చేస్తాయి. క్రీడలు ఆడటం శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే మరో మార్గం. రిలాక్సేషన్ వల్ల మన శరీరానికి, భావోద్వేగాలకు మరియు మన నాడీ వ్యవస్థకు సమతుల్యత ఉంటుంది . క్రమం తప్పకుండా వ్యాయామం లేదా విశ్రాంతి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

        ఆచార్ అనగా రొటీన్. రోజు ప్రణాళిక లేకుండా పోవడం మరియు రోజులో ఎక్కువ పనితో మనము ఇబ్బంది పడటం తరచుగా జరుగుతుంది. మన మానసిక , శారీరక ఆరోగ్యం  మంచి నిత్యకృత్యాలపై (అచార్) ఆధారపడి ఉంటుంది. క్రమబద్ధత మరియు చిత్తశుద్ధి మంచి దినచర్య యొక్క రెండు ప్రధాన భాగాలు.  రోజును ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వీయ, పని, ఆహారం, వినోదం మరియు నిద్ర కోసం అవసరమైన అన్ని పనులను చేర్చండి. మన జీవితంలో చాలా ఇబ్బందులకు పరిష్కారాలు సరైన అలవాట్లు మరియు సరైన దినచర్యలను నిర్దేశించటంలో ఉన్నాయి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు "మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కాని మీరు మీ అలవాట్లను మార్చుకోవచ్చు మరియు మీ అలవాట్లు మీ భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తాయి" అనే వాారు.

        విచార్ అనగా ఆలోచనలు.  మన ఆలోచనలు మన మనసుకు ఆహారం. బుద్ధుడు ఇలా అంటాడు, “మీ ఆలోచన ఆధారంగా మీరు మీరే అవుతారు”. మీరు బలహీనంగా ఉన్నారని అనుకుంటే, మీరు బలహీనంగా ఉంటారు. మీరు బలంగా ఉన్నారని  అనుకుంటే, మీరు బలంగా ఉంటారు. మన ఆలోచన ప్రక్రియను సరిగ్గా నిర్వహించుకోవాలి. ఎల్లప్పుడూ మంచి వైఖరిని  పెంపొందించుకోవాలి. మంచి పుస్తకాలు, గ్రంథాలు చదవడం,  పవిత్ర మంత్రాలను పఠించడం, పూర్వీకుల నుండి వచ్చిన ఆచారములు పాటించడం, మంచి అనుభవాలను గుర్తుచేసుకోవడం మరియు అన్ని పరిస్థితులలో సానుకూలంగా ఆలోచించడం ద్వారా మంచి ఆలోచన  ప్రక్రియను రోజువారీ జీవితంలో చేర్చవచ్చు.

    ఈ 4 నియమాలు పాటించడం ద్వారా మనం మనస్సు, శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
             

"ఆరోగ్యమే మహాభాగ్యము"


   

Sunday, February 14, 2021

ఓం కారం విశిష్టత

మన వేదములలో సుమారు వేలకి పై గా స్తోత్రములు చెప్పబడినవి. ప్రతి స్తోత్రం ఉచ్ఛరించడం వలన గాని, వినడం వలన గాని కలిగే ప్రయోజనం మన శరీరం, మనస్సు పై చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన నాడీ వ్యవస్థ, మన శరీరంలో  కుండలినీ శక్తి గా పిలువబడే 7 చక్రాలు శుద్ధి జరిగి శక్తి వంతమవుతాయి. శరీరంలో ప్రతి కణానికి రక్తం సరఫరా మెరుగవుతుంది. 

మన విశ్వం లో మొదట పుట్టిన శబ్దం  "ఓం"

ఓంకారం ఉచ్చరించ డం వలన కలిగే ప్రయోజనాలు:
* సృష్టి లో ఉన్న ప్రతి జీవరాశి ని సృష్టి యొక్క శక్తితో అనుసంధానం చేస్తుంది.
* శరీరంలో ప్రాణశక్తిని పెంచుతుంది.
* ఒత్తిడిని తగ్గిస్తుంది.
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి  గుండె పని తీరు మెరుగవుతుంది.
* ఏకాగ్రత తో పాటు జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
* శరీరంలో హార్మోన్ల ప్రభావం సమతుల్యంగా ఉంటుంది.
* ఓంకారం 15 నిమిషాలు ఉచ్ఛరించడం వలన రక్తపోటు తగ్గుతుంది.


విదేశాల్లో  అనేక యూనివర్సిటీల్లో ఓంకార నాదం పై జరిగిన పరిశోధనల్లో నాడీ వ్యవస్థ లో గల న్యూరోన్ల పని తీరు మెరుగైన ఫలితాలు కూడా ఉన్నాయి. పిల్లలతో కూడా రోజు ఉదయం ఓంకార ఉచ్ఛారణ చేయిస్తే వాళ్ళ లో చురుకు దనం పెరిగి స్కూల్ లో పాఠాలు శ్రద్ధగా నేర్చుకుని బాగా గుర్తు పెట్టుకోగలుగుతారు.

సాధన ఎలా చేయాలి అంటే సుఖాసనం లో కాని, వజ్రాసనం లో కాని, పద్మా సనం లో కాని నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకోవాలి. దీర్ఘ శ్వాస తీసుకుని వదులుతూ "ఓం" అని ఉచ్ఛరించాలి.

"లోకా స్సమస్తా స్సుఖినోభవంతు"
 
      

Thursday, February 11, 2021

యోగము

 "యోగము" అనగా సంస్కృతంలో ఐక్యత లేక విలీనము అని అర్థము. యోగాభ్యాసం యొక్క లక్ష్యం శరీరానికి, మనస్సు కు, శ్వాస కు సమతుల్యత సాధించడం. మనలోని అంతర్గతంగా ఉన్న శక్తులను వెలికి తీసి, వాటి ప్రతిభతో జీవితమును ఉద్దీపింప చేయు ఒక సాధనము యోగ.

                                     Yōga cittavr̥tti nirōdha     -   మనస్సు స్పష్టత పొందటం

యోగాభ్యాసం యొక్క అంతిమ లక్ష్యం మనస్సు పై పట్టు సాధించడమే.ఈ ఆధునిక ప్రపంచం వేగవంతమైంది. మనస్సు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉండదో , ఆందోళన, ఒత్తిడి మొదలై శరీరం మీద ప్రభావం చూపుతుంది. దానికి కావలసిన శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి పనికి వచ్చే పద్ధతులు మనకు యోగ శాస్త్రంలో లభిస్తాయి.


ఆసనాల ముఖ్య ఉద్దేశం శరీరం పై, ఆరోగ్యం పై పట్టు సాధించడమే. శ్వాస ద్వారా మనస్సుపై నియంత్రణ సాధించడం ప్రాణాయామము యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 

యమ, నియమం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహార, ధారణ, ధ్యాన, సమాధి అనబడే అష్టాంగ యోగ సాధన పద్ధతిని యోగ సూత్రాలు ద్వారా అందించారు పతంజలి మహర్షి. ఈ ఎనిమిది భాగాలు దశల వారీగా శరీరాన్ని, మనస్సును శుభ్రపరిచి అంతిమ దశ అయిన ఆత్మ జ్ఞానాన్ని అనుభవించ కలగడమే యోగము.

Wednesday, February 10, 2021

స్వ పరిచయం

                                                Hello 

నా పేరు శ్రావణి. నా భర్త కిషోర్ నాధ్. నాకు ఒక అమ్మాయి, పేరు సాన్వి. పుట్టి పెరిగిన ది పల్లెటూరు లో.  నాన్నగారు వ్యవసాయం. అమ్మ గృహిణి. నాకు అక్క, ఇద్దరు తమ్ముళ్ళు. సొంత ఊరు లో చదువు చెప్పించడానికి సరైన సౌకర్యాలు లేక నాన్నగారి దగ్గర బంధువు అయిన ౠరుగుపల్లి గోపాల కృష్ణ గారిచే స్థాపించ బడిన శశి విద్యా సంస్థలు లో హాస్టల్లో ఉంచి చదివించారు. హాస్టల్ అయినా ౠరుగుపల్లి గోపాల కృష్ణ గారు, వారి సతీమణి రాధా రాణి గారు మమ్మల్ని తల్లి, తండ్రి లా ఆదరించి విద్యా బుద్ధులు నేర్పించారు. పల్లె టూరు ప్రకృతి ఒడిలో నా బాల్యం, విద్యాభ్యాసం అవకాశం దొరకడం వల్ల ఇప్పటికీ ఆనందంగా భావిస్తాను. 

        వివాహం అయిన తరువాత బెంగళూరు లో కొన్ని సంవత్సరాలు, తరువాత హైదరాబాద్ వచ్చి స్థిరపడినాము. నాకు చేనేత వస్త్రాలు, పిల్లలకు సాంప్రదాయ దుస్తులు కుట్టించే వాటి మీద ఉన్న శ్రద్ధ తో sanvicollection.blogspot.com బ్లాగ్ ప్రారంభించాను. ఇంటర్ నెట్ లో బ్లాగ్ సందర్శించిన వారు బట్టల్ని డిిజైన్ చేసి ఇమ్మని అడిగేవారు. అలా saanvi exclusives పేరుతో ఆన్లైన్ బొటిక్ ప్రారంభించి బట్టలు  డిజైన్ చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసేదాన్ని. చేనేత వారి దగ్గర తెచ్చిన చీరలు, నేను డిజైన్ చేసిన చీరలు  ఆన్ లైన్ లో అమ్మేదాన్ని. బొటిక్, చిన్ని పాపను పెంచుకుంటూ యోగ సాధన మొదలు పెట్టాను. పాప తో ఎక్కువ సమయం గడుపుతూ అన్నీ నేర్పించే వయసులో తనకి తోడుగా ఉండాలి అనే ఆలోచనతో వ్యాపారం వదిలి యోగ సాధన తో పాటు ఖాళీ సమయం యోగ కి సంబంధించిన కోర్సులు మీద పెట్టాను. అలా నా యోగా ప్రయాణం మొదలు అయింది. డిప్లొమా ఇన్ యోగ, యోగ థెరపీ, ప్రెగ్నెన్సీలో  యోగ  కోర్సులు పూర్తిచేసి, యోగ & ధ్యానం నేర్పించడం లో శిక్షణ పొంది, నలుగురి కి నేర్పించడం మొదలు పెట్టాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని యోగ సత్సంగాలు మరియు శాస్త్ర(మానవ జీవశాస్త్రం, న్యూరోసైన్స్) సమావేశాలు ఎక్కడ జరుగుతున్న వెళ్లి క్రొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను.

        సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్ది మన జీవన విధానం లో చాలా మార్పు చోటుచేసుకుంది. ఉరుకులు పరుగులతో సాగుతున్న ఈ ప్రయాణం లో నైతిక విలువలు మర్చి పోతున్నాం. మన బంధువు లు, మిత్రులు కష్టంలో ఉన్న పలకరించలేని జీవన సైలిలో నడుస్తున్నాము.. ఆహారపు అలవాట్లు సన్నగిల్లి పోతున్నాయి. వంటింట్లో అమ్మమ్మ చిట్కాలు మర్చి పోయి చిన్న దానికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము.  మనకి తెలిసినది గోరంత, తెలుసుకోవలసింది కొండంత. కాబట్టి మనకి మనం కొంత సమయం కేటాయించి పెద్దల మాట చద్ది మూట సామెత గుర్తు చేసుకుంటూ మన పూర్వీకుల నుండి వచ్చిన విలువైన గ్రంథ విషయాలను, ఆచారవ్యవహారాలను, ఆహారపు అలవాట్లను తెలుసుకుని ఆచరించి ఆనందంగా, ఆరోగ్యంగా జీవనం సాగించాలని, మన తరం తరువాత తరానికి కూడా ఉపయోగ పడే సమాచారాన్ని అందచేయడానికి ఈ బ్లాగ్ ప్రారంభించాను.

"సర్వే జనా సుఖినోభవంతు"