English Translated

Soon we will also post English translated articles to the blog....

Friday, February 26, 2021

శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం - అనగా ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి సాధనము

"శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం"  అనగా ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి  సాధనము
అని చరకసంహిత అనే ఆయుర్వేద గ్రంథం లో చెప్పబడినది. ఈ శరీరమే మనం జీవించి ఉన్నంత కాలం మన వాహనం , కావున శరీరాన్ని  చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉన్నది.  

        దేహమే దేవాలయం అంటారు కదా, కాబట్టి శరీరం ఆరోగ్యంగా, చైతన్య వంతంగా  ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే  ఆహార నియమాలు, యోగాభ్యాసం, సత్యవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలి.  ఈ జీవన విధానం అలవరచుకోవడానికి మనము ముఖ్యం గా పాటించవలసినవి 4 నియమాలు ఆహార్, విహార్, ఆచార్, విచార్.

        ఆహారం విషయానికి వచ్చేసరికి. మనము తినే ఆహారం బట్టి మనం శరీరం పనితీరు ఉంటుంది.కాబట్టి మనం తినే ఆహారం లో పోషక విలువలు గమనించాలి. తాజాగా వండిన వాటిని తినాలి. ఆహారం నోట్లో నములుతూ ఉండగానే సగం అరగాలి కాబట్టి టీవీ, మీడియా ప్రభావం పడకుండా ఏకాగ్రత తో నమిలి తినాలి. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. మితంగా (పొట్ట లో సగ భాగం ఆహారం, పావు వంతు నీరు, పావు వంతు ఖాలీగా ఉండే టట్టు)తినాలి. మనం తినే ఆహారం రంగు, రుచిని ఆస్వాదిస్తూ తినాలి.

        విహారం అంటే వినోదం. ఈ రోజుల్లో ఒత్తిడి ఒక సాధారణ అంశం అయినది. ప్రతిఒక్కరూ రోజువారీ పనులతో ఒత్తిడికిగురవుతున్నారు. కాబట్టి ఎవరికి వాారు వినోదం, విశ్రాంతి కొరకు  సమయం కేటాయించుకోవాలి. కుటుంబ సమయాన్ని ఆస్వాదించడం ద్వారా కూడా మన శరీరం మరియు మనస్సుకు చైతన్యం కలుగుతుంది. మనం ఆనందించే కార్యకలాపాలలో కొంత సమయం గడపడం వల్ల కూడా  మనస్సుపై ఆందోళనను తొలగిస్తుంది. మొక్కలు పెంచడం,  పెయింటింగ్, సంగీత వాయిద్యాలను ప్లే చేయడం వంటి క్రియాశీల సృజనాత్మక అభిరుచులు మనస్సును రీఛార్జ్ చేస్తాయి. క్రీడలు ఆడటం శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే మరో మార్గం. రిలాక్సేషన్ వల్ల మన శరీరానికి, భావోద్వేగాలకు మరియు మన నాడీ వ్యవస్థకు సమతుల్యత ఉంటుంది . క్రమం తప్పకుండా వ్యాయామం లేదా విశ్రాంతి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

        ఆచార్ అనగా రొటీన్. రోజు ప్రణాళిక లేకుండా పోవడం మరియు రోజులో ఎక్కువ పనితో మనము ఇబ్బంది పడటం తరచుగా జరుగుతుంది. మన మానసిక , శారీరక ఆరోగ్యం  మంచి నిత్యకృత్యాలపై (అచార్) ఆధారపడి ఉంటుంది. క్రమబద్ధత మరియు చిత్తశుద్ధి మంచి దినచర్య యొక్క రెండు ప్రధాన భాగాలు.  రోజును ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వీయ, పని, ఆహారం, వినోదం మరియు నిద్ర కోసం అవసరమైన అన్ని పనులను చేర్చండి. మన జీవితంలో చాలా ఇబ్బందులకు పరిష్కారాలు సరైన అలవాట్లు మరియు సరైన దినచర్యలను నిర్దేశించటంలో ఉన్నాయి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు "మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కాని మీరు మీ అలవాట్లను మార్చుకోవచ్చు మరియు మీ అలవాట్లు మీ భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తాయి" అనే వాారు.

        విచార్ అనగా ఆలోచనలు.  మన ఆలోచనలు మన మనసుకు ఆహారం. బుద్ధుడు ఇలా అంటాడు, “మీ ఆలోచన ఆధారంగా మీరు మీరే అవుతారు”. మీరు బలహీనంగా ఉన్నారని అనుకుంటే, మీరు బలహీనంగా ఉంటారు. మీరు బలంగా ఉన్నారని  అనుకుంటే, మీరు బలంగా ఉంటారు. మన ఆలోచన ప్రక్రియను సరిగ్గా నిర్వహించుకోవాలి. ఎల్లప్పుడూ మంచి వైఖరిని  పెంపొందించుకోవాలి. మంచి పుస్తకాలు, గ్రంథాలు చదవడం,  పవిత్ర మంత్రాలను పఠించడం, పూర్వీకుల నుండి వచ్చిన ఆచారములు పాటించడం, మంచి అనుభవాలను గుర్తుచేసుకోవడం మరియు అన్ని పరిస్థితులలో సానుకూలంగా ఆలోచించడం ద్వారా మంచి ఆలోచన  ప్రక్రియను రోజువారీ జీవితంలో చేర్చవచ్చు.

    ఈ 4 నియమాలు పాటించడం ద్వారా మనం మనస్సు, శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
             

"ఆరోగ్యమే మహాభాగ్యము"